: ఒడిశాలో లేడీ డాన్ వీర విహారం... అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడి
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిన్న జరిగిన అరాచక పర్వం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై ఓ లేడీ డాన్ తో పాటు ఆమె అనుచరులు మూకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే... భువనేశ్వర్ లోని లక్ష్మిసాగర్ ప్రాంతంలో ఓ మహిళ విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతూ లేడీ డాన్ గా అవతరించింది. తన మాట వినని కొందరు వ్యక్తులను ఆమె బంధించి చితకబాదుతోందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సదరు లేడీ డాన్ పై ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు తరలివెళ్లారు. పోలీసులను చూసి పరారు కావాల్సిన సదరు లేడీ డాన్, ఏకంగా పోలీసులపైకి ఎదురుతిరిగింది. చేతికి చిక్కిన పోలీసులను చితకబాదింది. లేడీ డాన్ అనుచరులు కూడా తమ బాస్ అడుగుజాడల్లోనే నడిచి పోలీసులపై కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తన అనుచరుల్లోని ఓ మహిళపై చేయి చేసుకున్న ఓ పోలీసును లేడీ డాన్ బురదలో పడేసి మరీ కొట్టింది. లేడీ డాన్ ను అరెస్ట్ చేయడం తమ వల్ల కాదని తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు పెట్టారు. అయినా కోపం చల్లారని లేడీ డాన్, ఆమె అనుచరులు పోలీసులను వెంటబడి మరీ కొట్టారు. ఆ తర్వాత మరోమారు భారీ సంఖ్యలో పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్న పోలీసు బాసులు ఎట్టకేలకు లేడీ డాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై లేడీ డాన్ దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం జాతీయ ఛానెళ్లలో హల్ చల్ చేస్తున్నాయి.