: భారత మార్కెట్ ను ముంచెత్తనున్న కొత్త కార్లు ఇవే!
మరో పండగ సీజన్ మొదలయ్యే సమయం వచ్చేసింది. ఆషాడ మాసంలో బోనాల మొదలు, జులై 18న రంజాన్, ఆపై శ్రావణంలో రాఖీ పౌర్ణమి, తరువాత వరుసగా వచ్చే వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి... వచ్చే ఐదారు నెలలూ ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలకు పండగే. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ, కస్టమర్లను దగ్గర చేసుకునేందుకు యత్నిస్తుంటాయి. ఆటో రంగానికి వస్తే జులై నెలాఖరులోగా కనీసం 5 కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. పండగ సీజన్ అమ్మకాలను కోల్పోరాదన్న ఉద్దేశంతో పలు కంపెనీలు లగ్జరీ కార్ల నుంచి లోఎండ్ చిన్నకార్ల వరకూ విడుదలకు ప్రణాళికలు రూపొందించాయి. ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయించే మారుతి సుజుకి 'ఎస్-క్రాస్'ను ఈ పండగ సీజనులో రిలీజ్ చేయనుంది. జులై నెలాఖరులోగా వచ్చే ఈ ఎస్ యూవీ ధర రూ. 7.5 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ సీజన్లో మార్కెట్లోకి రానున్న కొత్త కార్లలో ఆడీ-క్యూ3 కూడా ఉంది. ఈ కారును జూన్ 18న మార్కెట్లోకి విడుదల చేస్తామని ఇప్పటికే సంస్థ ప్రకటించింది. దీని ధర రూ. 28 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఇక వోక్స్ వాగన్ నుంచి 'వెంటో ఫేస్ లిఫ్ట్' పేరిట ఈ నెల 23న రూ. 7.80 లక్షల నుంచి రూ. 11.5 లక్షల ధరలో కొత్త కారును విడుదల చేయనుంది. ఇక హోండా సంస్థ 'జాజ్' సరికొత్త వేరియంట్ ను పరిచయం చేయనుంది. ఈ కారు జులై 8 నుంచి షోరూముల్లో కొలువుదీరనుంది. ఈ కారు ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 5 నుంచి రూ. 8 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. జులైలోనే 21వ తేదీన హ్యుందాయ్ తన కొత్త ఐదు సీట్ల ఎస్ యూవీ 'క్రెటా'ను విడుదల చేయనుంది. దీని ఖరీదు రూ. 8 నుంచి రూ. 12.5 లక్షల మధ్య ఉండనుంది.