: నెల రోజులు ఆంధ్రా వారిని తిట్టకుండా ఉండగలవా?: కేసీఆర్ కు కేఈ సూటి ప్రశ్న
ఉమ్మడి రాజధానిలో ఆంధ్రా ప్రజలకు, నేతలకు భద్రత కరవైందని, తెలంగాణ ముఖ్యమంత్రి నిత్యమూ ఏపీ ప్రజలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెదేపా నేత కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కనీసం నెల రోజుల పాటు ఆంధ్రా వారిని తిట్టకుండా ఉండగలవా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా, వైకాపా అధినేత వైఎస్ జగన్ కనీసం నోరు విప్పి ఖండించడం లేదని తెదేపా నేత కేఈ కృష్ణమూర్తి అన్నారు. జగన్ రూపంలో కేసీఆర్ కు ఆంధ్రాలో ఓ తోడుదొంగ దొరికాడని ఎద్దేవా చేశారు. పట్టిసీమ పథకం పోలవరంలో భాగమని, దానికి ఎవరి అనుమతులూ అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, ట్రైబ్యునల్ అనుమతి తీసుకోలేదని గుర్తు చేశారు. కేసీఆర్ వాడుతున్న భాష అత్యంత అభ్యంతరకరమని, సన్నాసులు, ముండమోపులు అనడం భావ్యత కాదని, ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సుంకేసులపై బాంబులు వేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను జగన్ తక్షణం ఖండించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు రాజ్యాంగంపై నమ్మకం లేదని, హైదరాబాదులో ఏపీ ప్రజలకు అవమానాలు జరగకుండా చూడాలని గవర్నరుకు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు.