: వినూత్న శిక్ష...600 మొక్కలు నాటు
ఆందోళన చేస్తున్న మహిళపై అత్యంత సమీపం నుంచి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు అధికారికి టర్కీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. 2013లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో చిన్న చిన్న పార్కులను తీసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇస్తాంబుల్ లో ఆ పార్కులే ప్రజలకు విశ్రాంతి నిలయాలని, పార్కులను తీసేస్తే వందలాది మొక్కలు నాశనమైపోతాయని, టర్కీకి పచ్చదనాన్నిచ్చే పార్కులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గానాబజానాలతో యువకులు, మహిళలు పగలు రాత్రి అని తేడా లేకుండా ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా పతీహ్ జెడ్ అనే పోలీసు అధికారి ఓ మహిళపై అత్యంత సమీపం నుంచి టియర్ గ్యాస్ స్ప్రే చేశాడు. దీంతో ఆమె గాయపడింది. ఈ కేసును విచారించిన టర్కీ న్యాయస్థానం, ఆ పోలీసు అధికారి వ్యక్తిత్వం మంచిదని, దానిని దృష్టిలో పెట్టుకుని తీర్పునిస్తున్నామని పేర్కొంది. శిక్షగా 600 మొక్కలు నాటాలని ఆదేశించింది.