: పెళ్లి ఖర్చు 5 లక్షలు మించిందా?... జరిమానానే!
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. దానిని జీవితకాల జ్ఞాపకంగా మలచుకునేందుకు అందరూ తాపత్రయపడతారు. కేరళీయులైతే మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటారు. అందుకే అక్కడ వివాహాలు భారీ ఖర్చుతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ విచ్చలవిడితనాన్ని, దుబారా ఖర్చులను నియంత్రించాలని కేరళ మహిళా కమిషన్ నిర్ణయించింది. వివాహానికి అయ్యే ఖర్చు ఐదు లక్షల రూపాయలకు మించకూడదంటూ కొన్ని ప్రతిపాదనలను కేరళ ప్రభుత్వానికి పంపించింది. పెళ్లిలో వధువు 80 గ్రాములకు మించి బంగారం కొనుగోలు చేయరాదని పేర్కొంది. ఎందుకంటే, దేశంలో 20 శాతం బంగారం కేరళీయులే కొంటున్నారు. పెళ్లి అంటే వివిధ రకాల నగలు కొంటూ ఆడంబరం చాటుకుంటున్నారు. అలాగే వారి పెళ్లిలో 75 శాతం ఖర్చు నగలు, దుస్తుల మీదే ఉంటుందని మహిళా కమిషన్ పేర్కొంది. వివాహానికి హాజరయ్యే అతిథుల సంఖ్య 200 మందిని మించకూడదని పేర్కొంది. వధువు దుస్తులకు పది వేల రూపాయలకు మించి ఖర్చు చేయరాదని, వరుడు దుస్తులకు ఐదు వేల రూపాయలకు మించి ఖర్చు చేయకూడదని ప్రతిపాదించింది. వివాహ వేదికకు పాతిక వేలకు మించి ఖర్చు చేయరాదని సూచించింది. ప్లేటు భోజనం వంద రూపాయలకు మించరాదని పేర్కొంది. మొత్తంగా 5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలని, ఆ మొత్తం దాటితే వివాహానికి జరిగిన ఖర్చులో 25 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. ఇలా జరిమానాగా విధించిన మొత్తం పేదల పెళ్లిళ్లకు వినియోగించాలని పేర్కొంది. వివాహం పేరిట ఏడాదికి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ. తాజా ప్రతిపాదనలతో వివిధ వ్యాపార వర్గాల్లో ఆందోళన రేగుతోంది. కేరళలో జరిగే వివాహంలో నగలు, దుస్తుల కోసం 50 లక్షల వరకు ఖర్చు చేస్తారని ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ తెలిపింది. వివాహాలు ఆడంబరంగా నిర్వహించడాన్ని కేరళీయులు ఆస్వాదిస్తారని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.