: ఇకపై అలా భయపడక్కర్లేదు...చట్టం చేయనున్న కేంద్రం
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అటుగా వెళ్తున్నవారు 'ఇబ్బందులు ఎందుకులే' అనే భయంతో వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్తే, వాళ్లు అడ్మిట్ చేసుకోరు. పోలీస్ కేసు పెట్టాలంటారు. ఈ విషయంలో గతంలో కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దీంతో గాయపడ్డవారిని వైద్యులు ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే చికిత్స చేస్తున్నారు. అయితే ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? ఏం జరిగింది? ఎలా జరిగింది? అంటూ పోలీసులు వేధిస్తారనే భయంతో చాలా మంది ప్రమాద బాధితులను ఆదుకునేందుకు వెనకాడుతారు. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా కేంద్రం కొన్ని వెసులుబాట్లు తీసుకురానుంది. ఇకపై ప్రమాద బాధితులను ఆదుకునేవారు తమ వివరాలు వెల్లడించాల్సి అవసరం లేదు. ఆసుపత్రిలో జాయిన్ చేసిన తరువాత అడ్రస్ చెప్పి వెళ్లిపోవచ్చు. ఆ తరువాత అతనిని ఎవరూ ప్రశ్నించరు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి కొన్ని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది.