: నీలాంటి కుక్కల మాటలు విని మోదీ అడ్డుకుంటాడా? కేంద్రం ఆ సాహసం చేస్తుందా?: ఉమపై కేసీఆర్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఎవరు అవునన్నా కాదన్నా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే సత్యం ఒకటుంది. పద్నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత కేసీఆర్ తెలంగాణ సాధించింది పాలమూరు పార్లమెంటు మెంబరుగానే. ఆ గౌరవం ఎప్పుడూ పాలమూరు ప్రజలకే దక్కుతుంది. పాలమూరు ప్రజలకు తెలంగాణ సమాజం తలవంచి నమస్కరిస్తుంది. ఉద్యమ సమయంలో ఇక్కడి పరిస్థితులు చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నానని, ఆ సమయంలోనే ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ వెళ్లానని, అది నక్సల్ ప్రభావిత ప్రాంతమైనా నన్నేం చేస్తారులే అని అక్కడి సభలో పాల్గొన్నానని, సభ ముగిసిన తర్వాత ఓ గుంపు వచ్చి తనను కలిసిందని వివరించారు. ఎవరు బ్రదర్ మీరు? అని అడిగితే, మేం పాలమూరు నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన కూలీలమని వారు చెప్పారు. ఆ తర్వాత కార్లో వస్తున్నంత సేపు పాలమూరు వాసుల దీన స్థితే మనసులో మెదిలాడింది. ఎక్కడ పాలమూరు, ఎక్కడ మహారాష్ట్ర బోర్డర్లోని నార్నూర్ అని ఆలోచించాను. అలాంటి దుస్థితి తొలగించాలని ఆనాడే కంకణం కట్టుకున్నాను. అందుకే జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. పాలమూరు ప్రాజెక్టులు ఇక శరవేగంతో సాగిపోతాయి. అయితే, రాష్ట్రం విడిపోయి ఏడాదైనా ఆంధ్రుల పీడ విరగడ కాలేదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు పీక్కు తింటున్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ సీఎం చంద్రబాబు ప్రోద్బలంతో మాపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవు, ఎక్కడ నిర్మిస్తావు కేసీఆర్? అని ఆ సన్నాసి ప్రశ్నిస్తున్నాడు. నీ అబ్బ జాగీరా కృష్ణా నది? సమైక్యరాష్ట్రంలో నీ ఇష్టం వచ్చినట్టు దొడ్డిదారిన కట్టినటువంటి ప్రాజెక్టులకు, నీ హంద్రీనీవా ప్రాజెక్టుకు అనుమతి ఉందా? నీ పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉందా? నీ కండలేరుకు అనుమతి ఉందా? నీ సోమశిల రిజర్వాయర్ కు అనుమతి ఉందా? ఎవరబ్బ జాగీరు అని కట్టావు? పట్టిసీమ ప్రాజెక్టు నిన్నగాక మొన్న మొదలుపెట్టారు మీరు... పోలవరం నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించడానికి. ఎవర్నిడిగి మొదలుపెట్టావు? అలాంటప్పుడు నన్నడిగే అధికారం నీకెక్కడిది? అని అడుగుతున్నా. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నీలాంటి కుక్కల మాటలు విని పాలమూరు ప్రాజెక్టు వద్దంటాడా? కేంద్రం అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా? హరిహరబ్రహ్మాదులు అడ్డంవచ్చినా, నీ తాతజేజమ్మలు అడ్డంవచ్చినా, కోటిమంది చంద్రబాబు నాయుళ్లు కొంగజపాలు చేసినా మీ కళ్ల ముందే ప్రాజెక్టు కట్టిచూపిస్తాం. ఇదే నా పాలమూరు శపథం. ఇది తెలంగాణ గడ్డ, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు" అని హెచ్చరించారు.