: తండ్రయితే... పూర్తి జీతంతో కూడిన ఏడాది సెలవు: యూకే సంస్థ బంపర్ ఆఫర్
మహిళలకు మెటర్నటీ లీవ్ ఇవ్వడం సర్వసాధారణం. కానీ 'వర్జిన్' సంస్థ మగవాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తండ్రి అయితే పూర్తి జీతంతో కూడిన ఏడాది సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ఆ సంస్థలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే అర్హతను నిర్ణయించింది. యూకేలో వర్జిన్ అనే ఇన్వెస్ట్ మెంట్ అండ్ బ్రాండ్ లైసెన్సింగ్ సంస్థ ఉంది. ఈ సంస్థకు యూకేతో పాటు ఇతరదేశాల్లో కూడా శాఖలు ఉన్నాయి. సుమారు 50,000 మంది ఉద్యోగులున్నారు. అయితే లండన్, జెనీవా శాఖల్లో పని చేసే 140 మంది ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్ ను వర్తింపజేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. వీరిలో నాలుగేళ్ల సర్వీసు లేకపోతే రెండేళ్లైనా పని చేసి ఉండాలని, అలా రెండేళ్లు పని చేసిన ఉద్యోగులకు ఏడాది సెలవు, 25 శాతం జీతం చెల్లించనున్నట్ట సంస్థ వెల్లడించింది. కేవలం బిడ్డల్ని కంటేనే కాదట, దత్తత తీసుకున్నా ఈ సెలవు, జీతం వర్తిస్తాయని సంస్థ ప్రకటించింది. తండ్రి అయిన తరువాత ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలా బాధగా ఉంటుందని, ఆ బాధను తాను అనుభవించానని, అలాంటి బాధ తన సంస్థలో పని చేసే ఉద్యోగులు అనుభవించకూడదని, తండ్రి అయిన తరువాత పరిస్థితులకు అలవాటు పడాలని ఈ ఆఫర్ ఇచ్చినట్టు సంస్థ అధినేత బ్రాన్ సన్ చెప్పారు.