: తెలంగాణలో కేసీఆర్ నెంబర్ వన్ మోసగాడు: ఎర్రబెల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాటల దాడి చేశారు. ఓ ముఖ్యమంత్రిగా ఆయన మాట తీరు బాగోలేదని, తెలంగాణ పరువును నిలువునా మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీపీ నేతలు మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు... ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిని నిన్న ఢిల్లీలో కలిస్తే, 'వాడినీ', 'వీడినీ' కలిసి కాళ్లుపట్టుకున్నారని మాట్లాడారని, 'ఇదేనా మీ భాష?' అని కేసీఆర్ ను ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ భాషను అసహ్యించుకుంటున్నారన్నారు. ఇలా మాట్లాడే ఆయన చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో పెట్టాలా? అని అడిగారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ట్రాన్స్ పోర్టు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని పదవి నుంచి తీసేసిన విషయాన్ని ఎర్రబెల్లి గుర్తు చేశారు. అసలు తెలంగాణ ఉద్యమకారులందరినీ కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. గతంలో ఓసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని మోసానికి పాల్పడ్డారని ఎర్రబెల్లి విమర్శించారు.