: ఆయనో పెద్ద ఫైటరూ... మేం పిరికిపందలమా?: సోమిరెడ్డి
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళితే పొగడాలా? మా నేతల ఫోన్లు ట్యాప్ చేస్తే ఏం మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నగరాలను లండన్, న్యూయార్క్, డల్లాస్ చేస్తానని చెబుతున్నారని అన్నారు. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. టీడీపీ పని అయిపోయింది అంటున్నారని, ముగిసింది టీడీపీ కథ కాదని, టీఆర్ఎస్ కథే ముగిసిందని అన్నారు. టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగి ఏపీ ముఖ్యమంత్రిపైనే నిందలు వేస్తావా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. నువ్వో పెద్ద ఫైటరు... మేం పిరికిపందలమా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఆంధ్రులకు ఎలా హక్కులు లేకుండాపోతాయో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఇక, తమను అడుగడుగునా ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డిపై కక్ష సాధించేందుకే టీఆర్ఎస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు.