: తప్పెక్కడ జరిగింది?... నిద్రలేని రాత్రుల మధ్య నెస్లే ఉద్యోగులు
వారికి సెలవులన్నీ రద్దయ్యాయి. కుటుంబంతో గడిపేందుకు సమయం లభించడం లేదు. నిద్రలేని రాత్రులెన్నో. గత రెండు వారాలుగా నెస్లేలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఇది. మ్యాగీ వివాదం చెలరేగిన తరువాత ఉద్యోగులపై తీవ్ర భారం పడింది. "నేను గత పదిహేను రోజులుగా ఏనాడూ రెండు గంటలకు మించి నిద్రపోలేదు" అని ఓ ఉద్యోగి వాపోయాడు. విశ్రాంతి లేని పని ఎదురుగా ఉందని, ప్లాంట్ల విజిట్, సమావేశాలు, పరీక్షలు, భవిష్యత్ వ్యూహాలు, నిర్ణయాలు... రేపేం జరుగుతుందో తెలియడం లేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ ఉద్యోగి వివరించాడు. రోజుకు 20 గంటలకు తక్కువ కాకుండా ఆఫీసుల్లో ఉంటూ, తప్పెక్కడ జరిగిందన్న విషయాన్ని తేల్చే పనిలో ఉన్నామని వివరించారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెస్లే సంస్థలో 7 వేల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా రోజువారీ పనిచేసే కార్మికులు మరో 5 వేల మంది వరకూ ఉన్నారు. మ్యాగీ ఫ్యాక్టరీల్లో పనిచేసే రోజువారీ కార్మికుల్లో 70 శాతం మందిని సంస్థ విధుల్లోకి రావద్దని ఇప్పటికే నెస్లే తేల్చి చెప్పింది.