: సగం ధరకే బీమా పాలసీలు కావాలంటే...
మీ వయసు ఇరవైల్లోనో, ముప్పైల్లోనో ఉంటే... మీ చుట్టూ తిరుగుతూ "బీమా చేయించుకోండి, పాలసీలు కట్టండి" అని తిరిగే ఇన్స్యూరెన్స్ ఏజంట్ల జాబితా పెద్దగానే ఉంటుంది. తలుపుతట్టి, దగ్గరుండి కాగితాలు పూర్తి చేసి సంతకాలు తీసుకువెళ్లి పాలసీ పత్రాలు చేతికిచ్చి, ఆపై నిర్ణీత కాలవ్యవధిలో ప్రీమియంను గుర్తు చేస్తూ, దానిపై వచ్చే కమిషన్ ఆధారంగా జీవనాధారం గడుపుతున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. అయితే, మారిన పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికత, పేపర్ లెస్ టెక్నాలజీ, ఇంటర్నెట్ తదితరాలు బీమా కంపెనీలను సమూలంగా మార్చివేశాయి. ఆన్ లైన్ మాధ్యమంగా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకు పాలసీలు లభిస్తున్నాయి. ఆఫ్ లైన్లో ఏంజట్ల వద్ద పాలసీలు కొనడంతో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకు పాలసీలు నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు రోజుకు రూ.8.50 చెల్లింపుతో (అంటే నెలకు రూ.255) రూ. 50 లక్షల పాలసీ లభిస్తోంది. అదీ ఆన్ లైన్లో కొనుగోలు చేస్తేనే. బీమా కంపెనీ నుంచి డైరెక్ట్ గా కొనుగోలు చేయడం వల్ల కంపెనీల మధ్యంతర ఖర్చుల భారం, అంటే కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, ఏజంట్లకు చెల్లించాల్సిన కమిషన్ తదితరాలు కస్టమర్ పై పడవు. ఇక మరణాల ప్రమాదం, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి తదితరాలపై జరిపే విచారణ ఒక్క క్లిక్ తో అయిపోతుంది. అంటే కస్టమర్ ఇచ్చే హామీనే బీమా కంపెనీలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. దీంతోపాటు ఆన్ లైన్లో పాలసీ గురించిన సమగ్ర సమాచారమూ ఉంటుంది. పాలసీ గురించిన ఫీచర్లు, కాల పరిమితి, రైడర్లు తదితరాలన్నీ పోల్చి చూసుకునే సౌలభ్యమూ ఉంది. అన్నీ చూసి ఏ ఏజంటుపైనా ఆధారపడకుండానే సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇక సామాజిక మాధ్యమాలు విస్తరించిన తరువాత పాలసీల గురించి, వాటిని వాడుతున్నవారి స్పందన సులువుగా పొందవచ్చు. పాలసీ క్లయిముల విషయంలో ఏ సంస్థ ఎంత వేగంగా స్పందిస్తోందన్న సమాచారం కూడా నెట్లో సులువుగానే లభిస్తుంది. ఆన్ లైన్లో పారదర్శకత అధికం. చెల్లింపులూ సులభం. పైగా తక్కువ ధరకు పాలసీలు. అందువల్లే భారత బీమా రంగంలో ఆన్ లైన్ విప్లవం శరవేగంగా విస్తరిస్తోందని అంటున్నారు నిపుణులు.