: శిల్పాకు ఎమ్మెల్సీ అయినా దక్కేనా?
కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం శిల్పా చక్రపాణి రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ సోదరుడైన చక్రపాణి రెడ్డి నాలుగేళ్ల క్రితం రాజకీయ తెరంగేట్రం చేశారు. స్వస్థలం జిల్లాలోని నంద్యాల అయినప్పటికీ, శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఆయన మొన్న బరిలోకి దిగారు. అంతకుముందే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఆయనకు జిల్లావ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అసెంబ్లీ బరిలో ఆయన విజయం ఖాయమని అంతా భావించారు. అయితే మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డి కుమారుడు రాజశేఖరరెడ్డి (వైసీపీ అభ్యర్థి) చేతితో చక్రపాణి రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చక్రపాణిరెడ్డికి అప్పగించమే కాక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ బరిలో టికెట్ కూడా ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేశారు. అయితే జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా, 11 సీట్లలో వైసీపీ అభ్యర్థులే ఉన్నారు. అంతేకాక స్థానిక సంస్థల్లోనూ వైసీపీ నేతలే మెజార్టీ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో చక్రపాణిరెడ్డి వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కాంక్షతో చక్రపాణిరెడ్డి తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. మరి ఆయనను ఈ సారైనా విజయం వరిస్తుందో, లేదో చూడాలి.