: 'అర్జంటుగా చూడండి, ఎందుకంటే ఇది మీ వీడియోనే'... ఒపెన్ చేస్తే ఫేస్ బుక్ ఖాతాలపై 'అశ్లీల దాడి'... నెటిజన్లూ జాగ్రత్త!
మీ ఫేస్ బుక్ ఖాతా అశ్లీల చిత్రాలతో నిండిపోతుంది. టైమ్ లైన్ పై బూతు బొమ్మలను పోస్టు చేస్తుంది. స్నేహితులు, దగ్గరి వారి వద్ద మీ పరువు తీస్తుంది. ఇదే కొత్తగా ఫేస్ బుక్ ఖాతాలను పట్టుకుంటున్న మాల్ వేర్. 'కిలిమ్' మాల్ వేర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ కొత్త వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఖాతాల్లోకి వెళ్లి వారి 'ఫ్రెండ్స్' ఖాతాలపై కనిపిస్తోంది. దీన్ని క్లిక్ చేస్తే అంటుకుపోతుంది. 'ఎక్స్' రేటెడ్ మెటీరియల్ తో ఖాతాలను చెడగొడుతుంది. దీన్ని తొలిసారిగా ఆగ్రా పోలీసులు కనుగొన్నారు. మీ స్నేహితుల ఖాతా నుంచి "అర్జంటుగా చూడండి... ఎందుకంటే ఇది మీ వీడియోనే" (watch urgent, because it is your video) అనే మెసేజ్ వస్తుంది. ఉత్సుకతతో తెరచారంటే వైరస్ ను అంటించుకున్నట్టే. కాబట్టి నెటిజన్లూ తస్మాత్ జాగ్రత్త. దీని బారిన పడకుండా ఉండాలంటే ఆ లింకును తెరవకుండా ఉండడం ఒక్కటే మార్గం.