: హింసించి చంపుతున్నాడు... ఆప్ నేత సోమనాథ్ భారతిపై ఫిర్యాదు చేసిన భార్య
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా గృహహింస కేసు పెట్టారు. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారన్నది లిపిక ఆరోపణ. ఈ మేరకు ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సోమనాథ్ ను ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించిన మహిళా కమిషన్ కేసు దర్యాప్తును ప్రారంభించింది. కాగా, ఈ కేసులో ఇంతవరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని సమాచారం. తాను ఏడునెలల గర్భవతిగా ఉన్న సమయంలో తన మీదకు పెంపుడు కుక్కను ఉసిగొల్పాడని, ఇప్పుడు తనకు, తన బిడ్డలకు కనీస ఖర్చుల నిమిత్తం కూడా డబ్బివ్వడం లేదని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. తనకీ వైవాహిక జీవితం వద్దని, ఇద్దరు పిల్లలతో గౌరవంగా బతకాలని ఉందని అన్నారు. ఈ మానసిక హింసను తాను తట్టుకోలేకున్నానని తెలిపారు.