: రేవంత్ పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి...ఆ దృశ్యాలను తొలగించి వీడియో విడుదల: మత్తయ్య ఆరోపణ
ఓటుకు నోటు కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కుమారుడి నివాసం వద్ద ఆ రోజు పెద్ద గొడవే జరిగిందట. అరెస్ట్ సందర్భంగా రేవంత్ రెడ్డి మీసాలు మెలేసిన దృశ్యాలనే మనం చూశాం. కానీ, మనకు తెలియని భారీ గొడవ అక్కడ జరిగిందట. ఈ మేరకు నిన్న విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంగా ఓటుకు నోటు కేసు నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్తయ్య చెప్పిన వివరాల మేరకు... ఏసీబీ అధికారుల సమక్షంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిపై దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని రేవంత్ రెడ్డి కూడా దీటుగానే ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన మీసం మెలేశారు. ఈ మొత్తం వ్యవహారం అప్పటికే అక్కడ ఏసీబీ ఏర్పాటు చేసిన సీక్రెట్ కెమెరాల్లో రికార్డైంది. అయితే రేవంత్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి దృశ్యాలను తొలగించిన ఏసీబీ, రేవంత్ మీసం మెలేస్తున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేసిందట.