: అధికారుల తీరు మారకుంటే, ప్రజలే సజీవదహనం చేస్తారు: పటాన్ చెరు ఎమ్మెల్యే వ్యాఖ్య
వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ నేతలు కేంద్ర బిందువులు. ఉత్తరప్రదేశ్ లో అధికారం వెలగబెడుతున్న సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. నిత్యం ఏదో ఒక అంశంపై నోరు జారుతున్న ఈ రెండు పార్టీల నేతలు జాతీయ మీడియా పతాక శీర్షికలకెక్కుతున్నారు. తాజాగా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేతలూ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మెదక్ జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్య చేశారు. తీరు మార్చుకోని అధికారులను ప్రజలు సజీవ దహనం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాలుష్య పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి. కొందరు మాత్రం అలాంటి పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యలకు కారణమవుతున్నారు. వారు తీరు మార్చుకోవాలి. లేదంటే వారిని ప్రజలే సజీవ దహనం చేస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.