: బాబూ.. మీతో ఫొటో దిగాలనుంది: ఏపీ సీఎంతో ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య
ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కార్యాలయం వద్ద నిన్న ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజ్ నాథ్ ను కలిసేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వెళ్లిన సమయంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా వెళ్లారు. అయితే కాస్త ముందుగా వెళ్లిన నరసింహన్ నేరుగా రాజ్ నాథ్ కేబిన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత తన కార్యాలయానికి చంద్రబాబు వచ్చారన్న సమాచారంతో గవర్నర్ ను బయటకు పంపిన రాజ్ నాథ్, ఏపీ సీఎంను ఆహ్వానించారు. ఈ సమయంలో రాజ్ నాథ్ కేబిన్ తలుపు వద్ద నరసింహన్, చంద్రబాబు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం లోపలికి వెళ్లబోతున్న చంద్రబాబును చేయి పట్టుకుని మరీ ఆపేసిన నరసింహన్, ‘‘చంద్రబాబూ..మీతో ఓ ఫొటో దిగాలనుంది’’ అంటూ ఫొటోలకు ఫోజిచ్చారు.