: వంద కోట్లా? బ్లాక్ బస్టరా? అన్నది ముఖ్యం కాదు!: బాలీవుడ్ దర్శకుడు
సినిమా ఎన్ని వసూళ్లు రాబట్టింది? రికార్డుల దిశగా కొనసాగిందా? లేదా? అనేది ముఖ్యం కాదని, ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేదే ప్రధానమని బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'తను వెడ్స్ మను రిటర్న్స్' దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చెప్పారు. తాజాగా విడుదలైన 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ, సినిమా ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులకు రెండున్నర గంటలపాటు ఆనందం అందించడమే తన లక్ష్యమని, అందులో విజయం సాధించినందుకు తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఆనందం కలిగించడం, ఆనందంగా ఉండడమే తన లక్ష్యం తప్ప, వంద కోట్లో లేక బ్లాక్ బస్టర్ విజయాలో కాదని ఆయన చెప్పాడు. కాగా, గతంలో సునీల్ హీరోగా రూపొందిన 'మిస్టర్ పెళ్లికొడుకు' సినిమా 'తను వెడ్స్ మను' తొలి భాగం ఆధారంగా రూపొందిన విషయం తెలిసిందే.