: హోటల్ గదిలో ఎయిర్ హోస్టెస్ ను వేధించిన సహోద్యోగి
'ఎయిర్ ఇండియా'లో మరో వేధింపుల కేసు నమోదైంది. సహోద్యోగి తనను వేధించాడని ఓ ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే, ముంబైలోని ఓ హోటల్ గదిలో విశ్రాంతి నిమిత్తం ఉన్న సమయంలో క్యాబిన్ క్రూలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఎయిర్ హోస్టెస్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ ఘటన గత నెల 25న జరిగిందని, ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తరువాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందని వివరించారు. కాగా, 'జీరో ఎఫ్ఐఆర్'లో భాగంగా నేరం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని పక్కనబెట్టి, తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం, నివేదికను తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పోలీసు స్టేషనుకు బదిలీ చేస్తారన్న సంగతి తెలిసిందే.