: రూ. 10 వేల కోట్లతో 'ఈక్వినిటీ'ని కొనుగోలు చేయనున్న విప్రో!
బ్రిటన్ లోని లక్షలాది మంది ప్రజల పెన్షన్ నిధులను నిర్వహిస్తున్న బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్) సంస్థ 'ఈక్వినిటీ'ని బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 10 వేల కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని స్కైన్యూస్ వెల్లడిస్తూ, ఈక్వినిటీతో చర్చలు తుది దశకు వచ్చాయని వెల్లడించింది. కాగా, మార్చి 2014 నాటికి రూ. 10,555 కోట్ల నగదు నిల్వలున్న విప్రో, వాటిని మార్చి 2015 నాటికి రూ. 15,668 కోట్లకు పెంచుకుంది. ఇండియాలోని మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న విప్రో గత కొన్ని సంవత్సరాలుగా మెరుగైన పనితీరును కనబరచడంలో విఫలమవుతోంది. కాగా, ఈక్వినిటీ కొనుగోలుపై విప్రో ప్రతినిధిని వివరణ కోరగా, మార్కెట్ వర్గాల ఊహాగానాలపై తాము స్పందించబోమని తెలిపారు. ఈ వార్త వెలువడిన తరువాత బీఎస్ఈలో విప్రో ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 1.77 శాతం పెరిగి రూ. 563కు చేరింది.