: 'అమేజాన్'తో మాకు పోలికే లేదు: 'అలీబాబా' అధినేత
చైనా కేంద్రంగా ఈ-కామర్స్ సేవలందిస్తున్న దిగ్గజం అలీబాబా వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ 'జాక్ మా' సంస్థ భవిష్యత్తుపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఎకనామిక్ క్లబ్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన సంస్థ దీర్ఘకాల ప్రణాళికలను గురించి వివరించారు. ఉజ్వల భవిష్యత్తు ఉందని నిర్ణయించుకున్న తరువాతనే చైనాను దాటి విదేశాలకు సంస్థను విస్తరిస్తున్నామని తెలిపారు. యూఎస్ నుంచి అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా కనీస వ్యాపారం జరగాలని కోరుకుంటున్నట్టు జాక్ మా తెలిపారు. ప్రస్తుతం అలీ బాబా చైనాలో తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను పలు దేశాల్లో విక్రయిస్తోంది. "మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు చైనాకు అవసరం. నేను ఇక్కడికి అందుకోసమే వచ్చాను. మా దేశంలో 10 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఏదో ఒకటి కొనుగోలు చేసేందుకు రోడ్లపైకి వస్తుంటారు. మేం పోటీ పడటానికి రాలేదు. కొంత వ్యాపారాన్ని తీసుకువచ్చాము" అని అన్నారు. అమెరికాలో నిత్యమూ అలీ బాబా, అమేజాన్, ఈబే వంటి ఈ-కామర్స్ సైట్లను పోలుస్తుంటారని గుర్తు చేసిన ఆయన, అమేజాన్ కు- తమకు పోలిక లేదని, తాము చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ, చిన్న వ్యాపారస్తులకు ప్రోత్సాహం అందిస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నామని తెలిపారు. చైనా కేంద్రంగా సాగుతున్న టీమాల్, తావ్ బావ్ వంటి కంపెనీలతో అమేజాన్ ను పోల్చవచ్చని అన్నారు. సమీప భవిష్యత్తులో కొద్ది శాతం ఆదాయమన్నా అమెరికా నుంచి పొందాలన్నదే తన పర్యటన లక్ష్యమని జాక్ మా వివరించారు.