: ఈసారి చంద్రబాబు వంతు... ఢిల్లీ పర్యటనలో ప్రైవేట్ హోటల్ లో దిగిన ఏపీ సీఎం
ఢిల్లీ పర్యటనలకెళ్లే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ పర్యటనల్లో సీఎంలతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు బస చేసేందుకు ఏపీ భవన్ అందుబాటులోనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ భవన్ ను కూడా రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. వీటిలో ఆయా రాష్ట్రాల సీఎంలు బస చేసేందుకు తగిన వసతులు కూడా ఇప్పటికే ఏర్పాటయ్యాయి. అయితే అక్కడి మన వసతి సౌకర్యం స్వీకరించేందుకు అటు తెలంగాణ సీఎం కేసీఆరే కాక, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడి అశోకా హోటల్ లో బస చేశారు. మూడు రోజుల పాటు అక్కడ ఉన్న కేసీఆర్ వసతికి లక్షల రూపాయాల ప్రభుత్వ ధనం ఖర్చయింది. తాజాగా ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ దఫా ప్రైవేట్ హోటల్ లో బస చేశారు. సాధారణంగా ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఏపీ భవన్ లోనే దిగే చంద్రబాబు, ఈ దఫా ప్రైవేట్ హోటల్ లో దిగడం చర్చనీయాంశంగా మారింది.