: నన్ను అరెస్ట్ చేస్తే, అదే కేసీఆర్ సర్కారుకు ఆఖరి రోజు: చంద్రబాబు
తనను అరెస్ట్ చేసినా, చెయ్యడానికి ప్రయత్నించినా, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఓ జాతీయ టెలివిజన్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. "ఆయనలా చెయ్యడానికి (అరెస్ట్) చూస్తే, అదే ఆయన ప్రభుత్వానికి ఆఖరి రోజు" అని బాబు వ్యాఖ్యానించారు. ఆడియో టేపుల వ్యవహారంలో తానెందుకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. "ఆయన నా సంభాషణలను రికార్డు చేసి వుండొచ్చు, లేదా ఆయన చానల్ చేసి వుండొచ్చు, కాకుంటే సంభాషణలను సృష్టించి వుండొచ్చు... ఈ విషయంలో నేనెందుకు సమాధానం చెప్పాలి?" అని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్యా సంబంధాలు మరింత బలంగా ఉండేందుకు తాను చేపట్టిన చర్యలను చూసి ఓర్వలేక తెలంగాణ ముఖ్యమంత్రి తనపై రాజకీయ దాడులు చేస్తున్నారని బాబు ఆరోపించారు. "మనం ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా మారాం. రెండూ తెలుగు ప్రజలవే. గతంలోనూ నేను చెప్పాను. మనం తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇరు రాష్ట్రాలనూ అభివృద్ధి పథంలో నడిపించాలని. కానీ కేసీఆర్ అందుకు సహకరించడం లేదు" అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారికి మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆరేనని ఆరోపించారు.