: మరో వివాదంలో చిక్కుకున్న ఏపీ మంత్రి పీతల సుజాత?
ఇటీవల తన ఇంటి కాంపౌండులో రూ. 10 లక్షలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆపై ఎలాగోలా బయటపడ్డ ఏపీ మంత్రి పీతల సుజాత తాజాగా ఇంకో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యుల ఖర్చు కోసమే తాను లంచం తీసుకున్నానని ఏసీబీకి పట్టుబడ్డ కృష్ణా జిల్లా మహిళా, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ చెప్పడం కలకలం సృష్టించింది. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అయితే, అది తన కోసం కాదని, మంత్రి ఖర్చుల కోసం వసూలు చేశానని ఆమె విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఎప్పుడు, ఎంత వసూలు చేశామన్న విషయాన్ని జెస్సీ డైరీలో రాసుకుంటూ ఉండి, దాన్ని కూడా అధికారులకు చూపినట్టు సమాచారం. ఏసీబీ అధికారులు తదుపరి విచారణ ఎలా జరపాలన్న విషయమై ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు.