: ఢిల్లీ వెళ్లిన గవర్నర్... కాస్త ముందే చేరుకున్న చంద్రబాబు
ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ... తన పర్యటన మర్యాదపూర్వకమని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వచ్చానని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలుస్తానని తెలిపారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయంత్రమే హస్తిన చేరుకున్నారు. ఆయన రేపు ప్రధానిని కలిసే అవకాశం ఉంది. అటుపై హోం మంత్రితో భేటీ అవుతారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా ఈ నెల 12న ఢిల్లీ వెళుతున్నారు. ఆయన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారని తెలిసింది. అయితే, ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా పరిణమించిన నేపథ్యంలో... ఉభయ రాష్ట్రాల సీఎంలకు, గవర్నర్ కు కేంద్రం ఏ రీతిన సలహాలు ఇస్తుందో చూడాలి.