: సెక్యూరిటీ మార్చుకుంటున్నారు... మరి నీళ్లు, కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు?: తలసాని


తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నివాసం వద్ద భద్రత సిబ్బందిని మార్చడంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఏపీ నేతలు వారి నివాసాల వద్ద సెక్యూరిటీ మార్చుకుంటున్నారని, అయితే, నీళ్లు, కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని ప్రశ్నించారు. హైదరాబాదులో చంద్రబాబు నివాసం వద్ద తెలంగాణ పోలీసుల స్థానంలో ఏపీ పోలీసులను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తలసాని వ్యాఖ్యలు ఏపీ సీఎంను ఉద్దేశించినవే అని అర్థమవుతోంది. అటు, చంద్రబాబు సోమవారం మంగళగిరిలో చేసిన వ్యాఖ్యలపైనా తలసాని స్పందించారు. హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య ఎక్కడొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాదులో ఏపీ ప్రజల ఇళ్లు ఎక్కడా కూల్చలేదని స్పష్టం చేశారు. ఇక, ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలుంటే చంద్రబాబు వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన కుట్ర రాజకీయాలపై తానూ ఓ అస్త్రం వదులుతున్నానని తలసాని అన్నారు. పరిటాల హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News