: కేసీఆర్, చంద్రబాబులపై భట్టి విక్రమార్క తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులను తక్షణం అరెస్టు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నీతిమంతుడైనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాబు డబ్బు ఆశ చూపి ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ముందే కేసీఆర్ కొనుగోళ్లు చేశారని, అసలు కొనుగోళ్లు మొదలు పెట్టిందే కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎర వేయడం కొనుగోలు కిందికి రాదా? అని ఆయన నిలదీశారు. అలా చూస్తే, ఎవరు ఎక్కువ అవినీతి పరుడు? అని ఆయన ప్రశ్నించారు. ఎడ్ల బండి కింద కుక్కలాగ పడుకుని తెలంగాణ మొత్తం తానే మోస్తున్నట్టు కేసీఆర్ ఫీలవుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో శాసనసభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కేసీఆర్ కొనుగోలు చేస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేను టీడీపీ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. వీరిద్దరు చేసింది అవినీతే కనుక తక్షణం వీరిని అదుపులోకి తీసుకుని, సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిబద్ధతతో కూడిన విచారణ జరగాలంటే వీరిద్దరినీ పదవుల నుంచి తొలగించాలని ఆయన పేర్కొన్నారు.