: చంద్రబాబు రేపు ప్రధానిని కలుస్తారు: యనమల


ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రివర్గ సమావేశంలో రెండు తీర్మానాలపై చర్చించామని తెలిపారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన సెక్షన్ 8 సమర్థంగా అమలు చేయాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తాజా పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుస్తారని యనమల వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. చంద్రబాబును అవమానిస్తే ఏపీ సర్కారు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కావాలనే పీసీ యాక్టు మోపారని అన్నారు. దీనిపై, గవర్నర్ కు, కేంద్రానికి నివేదిస్తామని వివరించారు. టీడీపీని రాజకీయంగా ఎవరూ ఎదుర్కోలేరని ధీమాగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమని, చంద్రబాబు ఫోన్ ఎలా ట్యాపింగ్ కు గురైందన్న దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. 120 ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్టు తమ వద్ద సమాచారం ఉందని యనమల వెల్లడించారు.

  • Loading...

More Telugu News