: కేసీఆర్ కు హితవు చెప్పిన జానా
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి స్పందించారు. నల్గొండలో సోమవారం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలను జానా తప్పుబట్టారు. ఉద్యమంలో ఉపయోగించిన భాషను పరిపాలన సందర్భంగా వాడడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యను పట్టించుకోలేదని కేసీఆర్ అనడం సరికాదని అన్నారు. ఏడాది పాలనలో ఒక్క గ్రామానికైనా నీళ్లిచ్చారా? అని జానా ప్రశ్నించారు. హైదరాబాదుకు కృష్ణా జలాలు అందించింది తామేనని స్పష్టం చేశారు. ఇక, ఓటుకు నోటు వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సర్కారును డిమాండ్ చేశారు.