: 'మేకిన్ ఇండియా'... ఇండియాలో తయారై యూఎస్ కు ఎగుమతి అవుతున్న తొలి కారు!
భారత వాహన పరిశ్రమ అత్యంత కీలకమైలురాయిని దాటనుంది. ఇండియాలో తయారైన కారు తొలిసారిగా అమెరికాకు ఎగుమతి కానుంది. ఫోర్డ్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం 'ఈకో స్పోర్ట్స్' ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి కానున్న తొలి వాహనంగా రికార్డు సృష్టించనుంది. అక్టోబర్ 2017లో తొలి వాహన యూనిట్ ఎగుమతి జరుగుతుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. సంవత్సరానికి 90 వేల యూనిట్లు కావాలని ఫోర్డ్ సంస్థ నుంచి కోటేషన్ అందిందని, ఇండియాలో విక్రయిస్తున్న యూనిట్ల కన్నా ఇది అధికమని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకూ ఏ అమెరికన్ కార్ల తయారీ సంస్థ కూడా ఇండియాలో తయారైన కార్లను దిగుమతి చేసుకోలేదు. అయితే, యూరప్ సహా పలు దేశాలకు భారత కార్లు ఎగుమతి అవుతున్నాయి. గతంలో స్కార్పియోను అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయత్నించి విఫలమైంది.