: టీటీడీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, తిరుమలలో రూ. 26 కోట్ల వ్యయంతో వసతి సముదాయాన్ని నిర్మించాలని తీర్మానించింది. తానా ఆధ్వర్యంలో అమెరికాలో నాలుగు చోట్ల శ్రీనివాసుడి కళ్యాణం నిర్వహించేందుకు ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా, తిరుమలలో ఎర్రచందనం మొక్కలు పెంచాలని నిర్ణయించింది. దీనికితోడు, చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద గోశాల నిర్మించాలని తీర్మానించింది. దీంతోపాటు, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో టీటీడీ భూమిలో 10 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రానికి ఆమోదం తెలిపింది. అలాగే నారాయణగిరి ప్రాంతంలో 7 మెగావాట్ల పవన విద్యుత్ ఏర్పాటుకు అంగీకరించింది.