: ఇరాక్ లో ఐఎస్ఐఎస్ నరమేధానికి సరిగ్గా ఏడాది
అనునిత్యం అరాచకాలకు పాల్పడుతూ, నెత్తుటి ఏర్లు పారిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ ఇరాక్ లో సాగిస్తున్న నరమేధానికి నేటితో ఏడాది పూర్తయింది. పోయిన ఏడాది జూన్ 9న ఇరాక్ లోని మోసుల్ నగరంపై ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. మరునాడే ఆ నగరం ఐఎస్ఐఎస్ వశమైంది. ఇరాక్ బలగాలపై పైచేయి సాధిస్తూ, మోసుల్ ఉన్న నినెవెహ్ ప్రావిన్స్ మొత్తాన్ని ఆక్రమిస్తూ పోయింది. దీంతో, పౌరులంతా స్వచ్ఛందంగా ఆయుధాలు ధరించి ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాడాలని ప్రధాని నూరీ-అల్-మాలికి పిలుపునిచ్చారు. అయినా, మరుసటి రోజే తిక్రిత్ పట్టణాన్ని మిలిటెంట్లు కైవసం చేసుకున్నారు. అనంతరం ఇరాకీ కుర్దిష్ దళాలను తరిమి కొట్టారు. మైనారిటీ ప్రజల మీద అత్యాచారాలు, హత్యలు చేస్తూ నరమేధం సృష్టించారు. ఈ క్రమంలో 17 వందల మంది షియాలను ఐఎస్ఐఎస్ ఊచకోత కోసింది. ఇక యాజిదీ తెగ ప్రజల జీవితాలైతే నరకప్రాయంగా మారాయి. మగవాళ్లను దొరికినవారిని దొరికినట్టు చంపుతూ, మహిళలను చెరబట్టి అత్యాచారాలకు తెగబడ్డారు. వందలాది యాజిదీ మహిళలు ఇప్పటికీ ఐఎస్ఐఎస్ అధీనంలో నరకం అనుభవిస్తున్నారు.