: తల్లిని హత్య చేసిన కుమార్తె... ప్రేమకు అడ్డుచెప్పడమే తప్పయింది!


ప్రస్తుత కాలంలో ప్రేమ మైకంలో యువతీయువకులు ఎంతటి ఘాతుకాలకైనా ఒడిగడుతున్న ఘటనలు తరచు చూస్తున్నాం. తాజాగా, ఓ యువతి తన తల్లినే హత్య చేసిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. కుమార్తె ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పడమే ఆ తల్లి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ముబారక్ పూర్ గ్రామానికి చెందిన సోనియా (22) కుల్విందర్ సింగ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, సోనియా ప్రేమ వ్యవహారానికి తల్లి శకుంతల దేవి (50) అభ్యంతరం చెప్పింది. దీంతో, సోనియా ప్రియుడు కుల్విందర్ తో కలిసి తల్లిని సజీవ దహనం చేసింది. సగం కాలిన మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చివేసింది. ఆ సమయంలో సోనియా సోదరులిద్దరూ ఇంటి వద్ద లేరు. ఆమె సోదరులు ఇంటికి వచ్చి తల్లి గురించి ఆరా తీసేసరికి ఓ కట్టుకథ చెప్పి వారి దృష్టి మరల్చాలని సోనియా ప్రయత్నించింది. 'ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని అమ్మ ఎవరితోనో వెళ్లిపోయింది' అని చెప్పిందా కిరాతకురాలు. అనుమానం వచ్చిన ఆ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. శకుంతల మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం, సోనియా, ఆమె ప్రియుడు కుల్విందర్ లను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News