: ఇతర గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారో చూడటం లేదా?: గవర్నర్ పై విరుచుకుపడ్డ సోమిరెడ్డి
గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గవర్నర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ 'అయ్యా, గవర్నర్ గా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించండ'ని విన్నవించారు. దేవుడు కనపడితే చాలు పొర్లు దండాలు పెట్టుకుంటూ, పాలన వ్యవహారాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. గవర్నర్ దేవుళ్లకు మొక్కుతుంటే... కేసీఆర్ మాత్రం గవర్నర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన కాళ్లు మొక్కుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలసి ఉమ్మడి రాజధానిలో ఉన్న సీమాంధ్రులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను వీరిద్దరూ హరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసి, చట్టాలు తెలిసిన వారైనప్పటికీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదని నరసింహన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నజీబ్ జంగ్ లాంటి ఇతర రాష్ట్ర గవర్నర్ లు ఎలా వ్యవహరిస్తున్నారో చూడటం లేదా? అని ప్రశ్నించారు. తమకున్న అధికారాలను తమరు ఎందుకు వినియోగించడం లేదో తెలియడం లేదని అన్నారు.