: మైనింగ్ మాఫియాకు బలి... జర్నలిస్టు సజీవ దహనం!
మైనింగ్ మాఫియా ఆగడాలకు ఓ విలేకరి బలైపోయాడు. ఉత్తరప్రదేశ్ లో మైనింగ్ అక్రమాలను వెలికితీస్తూ, వివిధ పత్రికలకు కథనాలు రాసి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నందుకు షాజహాన్ పూర్కు చెందిన జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టును సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే రాంమూర్తి ఈ ఘటనకు బాధ్యుడని, అతని ఆదేశాల మేరకు ఓ పోలీస్ అధికారి తన భర్తకు నిప్పంటించాడని జగేంద్ర భార్య ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. ఎమ్మెల్యే రాంమూర్తి అక్రమంగా గనులు తవ్వుకునేందుకు సహకరిస్తున్నాడని జగేంద్ర సింగ్ వార్తలు రాశాడు. కాగా, జగేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని, ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినపుడు ఈ ఘటన జరిగిందని షాజహాన్ పూర్ ఎస్పీ తెలుపడం గమనార్హం.