: ప్రముఖ పంజాబీ గాయకుడు ఆత్మహత్య
ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ (38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో, "ఈ ఫ్యాన్ నా జీవితాన్ని మింగేసేలా ఉంది" అని తరచూ అన్న ధరం ప్రీత్... చివరకు ఆ ఫ్యాన్ కే ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన భటిండాలోని తన సొంత నివాసంలోనే చోటు చేసుకుంది. అమృత్ సర్ లో జరిగిన ఒక ప్రదర్శనను ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత... నిన్న ఉదయం ఎంత సేపటికీ ధరం బైటకు రాలేదు. దీంతో అతని తల్లి ఇరుగుపొరుగు వారిని పిలుచుకుని వచ్చింది. వారు తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్ కు ధరం శరీరం వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో అతని భార్య, పిల్లలు ఇంట్లో లేరు. గత కొంత కాలంగా అతనికి ఆఫర్లు తగ్గిపోతుండటంతో అతను డిప్రెషన్ లోకి జారుకున్నాడు. ఈ కారణం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. పేద కుటుంబంలో జన్మించిన ధరం ప్రీత్ సింగ్ చిన్న తనం నుంచే గొప్ప గాయకుడిని కావాలని కలలుగనేవాడు. దానికి తగ్గట్టే సంగీతంపై మంచి పట్టు సాధించి... సొంతంగా 15 ఆల్బంలు విడుదల చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో ధరంకు మంచి క్రేజ్ ఉంది. ధరం ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తతో పంజాబీ సంగీత ప్రపంచం షాక్ కు గురైంది. సోషల్ మీడియాలో కూడా ధరంకు సంతాపాలు వెల్లువెత్తాయి. 2010లో అతని చివరి ఆల్బం 'ఎమోషన్ ఆఫ్ హార్ట్' విడుదలైంది. ఆ తర్వాత ఒక్క ఆల్బం కూడా విడుదల కాలేదు. దీంతో, అతను తీవ్ర నిరాశలోకి జారుకున్నాడు.