: కొత్త ఆవిష్కరణలతో రెడీ అవుతున్న యాపిల్
సమీప భవిష్యత్తులో యాపిల్ సంస్థ వినూత్న ఆవిష్కరణలతో స్మార్ట్ మార్కెట్ ను ముంచెత్తనుంది. వార్షిక డెవలపర్ల సమావేశంలో భాగంగా యాపిల్ చీఫ్ టిమ్ కుమ్ నూతనంగా అభివృద్ధి చేసిన పలు కీలక సాంకేతక మార్పులను ప్రకటించారు. సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ఎక్స్ కొత్త వర్షన్, యాపిల్ మ్యూజిక్ సర్వీస్, యాపిల్ వాచ్ కోసం నేటివ్ యాప్స్ త్వరలోనే రానున్నాయని వివరించారు. అప్ డేట్ చేసిన వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఈ నేటివ్ యాప్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యాపిల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభిస్తున్నామని, డిజిటల్ మ్యూజిక్ రంగంలో ఇది విప్లవాత్మక మార్పు కాగలదని టిమ్ కుక్ అభివర్ణించారు. ప్రతి సంగీత ప్రియుడికీ ఇది దగ్గరవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ లైవ్ రేడియో స్టేషన్ తో పాటు కోరుకున్న సంగీతం సులువుగా, వేగంగా స్ట్రీమ్ అవుతుందని, ఇది ఐఫోన్, ఐపాడ్, ఐపాడ్ టచ్, విండోస్, మాక్, పీసీ, యాపిల్ టీవీ తదితరాలకు అనువుగా ఉంటుందని, ఈ నెల 30 నుంచి 100 దేశాల్లో కస్టమర్లకు చేరువవుతుందని వివరించారు. మ్యూజిక్ యాప్ యాండ్రాయిడ్ వర్షన్ ఈ సంవత్సరమే సిద్ధమవుతుందని పేర్కొన్నారు. మూడు నెలల ఉచిత వినియోగం తరువాత నెలకు 9.99 డాలర్లు (సుమారు రూ. 640) చెల్లించాల్సి వుంటుందని వివరించారు. ఫ్యామిలీ ప్యాక్ లో భాగంగా 14.99 డాలర్లకు (సుమారు రూ. 960) ఆరుగురు మ్యూజిక్ సేవలను అందుకోవచ్చని తెలిపారు. ఐఓఎస్ 9 మరింత ఆధునికీకరించిన సెర్చ్ ఆప్షన్, మల్టీ టాస్కింగ్ లకు అనువుగా ఉంటుందని, రెండు యాప్స్ ఒకేసారి పక్కపక్కన వాడుకోవచ్చని కుక్ పేర్కొన్నారు.