: కొండలనైనా పిండి చేసే ప్రజాబలం టీడీపీ సొంతం: నందమూరి బాలయ్య


వెండితెరపై గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పి ప్రేక్షకులను రంజింపజేసే సత్తా టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ సొంతం. తండ్రి నుంచి వారసత్వంగా అందిన నటనతో తెలుగు ప్రేక్షకులను బాలయ్య రంజింపజేస్తున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో రాజకీయ నేతగానూ మారి అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక నిన్న గుంటూరులో జరిగిన మహా సంకల్ప సభలో ఆయన తన ప్రసంగంతోనూ మెప్పించారు. బహిరంగ సభల్లోనే కాక మీడియా సమావేశాల్లోనూ కాస్త తడబడినట్లు మాట్లాడే బాలయ్య, నిన్న చేసిన ప్రసంగం అక్కడి వారినే కాక టీవీల్లో లైవ్ చూసిన వారిని కూడా కట్టిపడేసింది. రాజకీయ నేతగా మారిన బాలయ్య మాటలో పదును కూడా పెరిగిందన్న కామెంట్లూ వినిపించాయి. కొండలనైనా పిండి చేసే సత్తా టీడీపీకి ఉందన్న బాలయ్య, ఏపీ చరిత్రను తిరగరాస్తామని ప్రకటించారు. నాడు తన తండ్రి ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించారన్న బాలయ్య, అదే కోవలో తాము ఏపీ చరిత్రను తిరగరాస్తామని వెల్లడించారు. ‘‘పుట్టుక అన్నది గ్రామానికి, జాతికి వన్నె తెచ్చే విధంగా ఉండాలని శంకరాచార్య చెప్పారు. ఆ పలుకులకు సజీవ రూపం నందమూరి తారకరామారావు. ఆయన ఎన్నో చరిత్రలు సృష్టించారు. ఆయన స్ఫూర్తితో ఈనాడు తెలుగు వారు ప్రపంచ దేశాల్లో దూసుకెళుతున్నారు’’ అని బాలయ్య అనర్గళంగా ప్రసంగించారు.

  • Loading...

More Telugu News