: ఈ హింసలు నేను భరించలేను, కాపాడండి: సౌదీలో కర్నూలు మహిళ ఆక్రందన
సౌదీ అరేబియాలో డబ్బు సంపాదించవచ్చన్న కోటి ఆశలతో వెళ్లిన ఓ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కరరెడ్డి నగర్ కు చెందిన ఖాజాబా(50)కు ముగ్గురు సంతానం. కూతురు ఆయేషాకు, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది. తను కూతురు వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మనవడు మహబూబ్ (4) గుండెకు చిల్లుపడిందని వైద్యులు చెప్పారు. దీంతో కూలీ చేసే కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించారు. అయినప్పటికీ 50 వేల రూపాయలు అప్పు అయికూర్చుంది. వడ్డీ కొండవీటి చాంతాడులా పెరిగిపోతుండడంతో, దానిని తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లింది. అంతే... డబ్బు సంపాదిద్దామని వెళ్లిన ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. సౌదీలో యజమానురాలు ఖాజాబాను చిత్రహింసలు పెట్టడం మొదలెట్టింది. దాంతో అవి భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని ప్రాధేయపడుతోంది.