: సూర్యుడిపై ప్లాట్లు అమ్మనివ్వడం లేదని 'ఈబే'ను కోర్టుకీడ్చిన మహిళ
ఈ-కామర్స్ దిగ్గజం 'ఈబే' వేదికగా సూర్యుడిపై ప్లాట్లు అమ్ముకుంటూ దర్జాగా బతుకుతున్న ఓ మహిళ, ఇప్పుడు తనను 'ఈబే' నిర్వాహకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. వివరాల్లోకి వెళితే, స్పెయిన్ లోని గలీసియా రీజియన్ లోని విగో అనే గ్రామానికి చెందిన మారియా దురాన్ (54) అనే మహిళ 2010లో ఓ నోటరీ ఆఫీసు ద్వారా సూర్యుడిని తన పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. ఆపై 'ఈబే'లో ఓ ఖాతాను తెరచి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న నోటరీ పత్రాలు చూపుతూ, సూర్యుడిపై చదరపు మీటరు స్థలాన్ని ఒక యూరో చొప్పున అమ్మకం ప్రారంభించింది. కొంతమంది సూర్యడిపై స్థలాలు కొనుక్కున్నారు కూడా. రెండేళ్ల తరువాత అంటే, 2012లో ఈమె ఖాతాను గుర్తించిన ఈబే దాన్ని తొలగించింది. దీంతో మారియా కోపం నషాళానికంటగా, కోర్టును ఆశ్రయించింది. ఈబే నుంచి తనకు 7,500 పౌండ్లు రావాల్సి వుందని కూడా ఆరోపించింది. కోర్టు బయట కేసును పరిష్కరించుకుందామని ఈబే రాయబారం పంపితే ఈమె తిరస్కరించింది కూడా. ఇప్పటికీ తన సొంత వెబ్ సైటు ద్వారా సూర్యడిపై ప్లాట్లు అమ్ముతున్న ఆమె "అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఏ దేశం కూడా ఒక నక్షత్రం, ఒక గ్రహంపై తమకు యాజమాన్య హక్కులున్నాయని చెప్పడానికి వీల్లేదు. కానీ, నాకా ఒప్పందం వర్తించదు. నేను ఓ వ్యక్తిగా ఈ ఒప్పందానికి కట్టుబడివుండాల్సిన అవసరం లేదు" అని లాపాయింట్లు తీస్తోంది. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియాలంటే, కేసు విచారణ జరిగే వరకూ ఆగాల్సిందే.