: మోదీ సర్కారు వెనక్కి తగ్గింది...ఇది విద్యార్థుల విజయం: రాహుల్ గాంధీ
మోదీ సర్కారు వెనక్కి తగ్గిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఐఐటీ విద్యార్థి సంఘంపై విధించిన నిషేధాన్ని కేంద్రం వెనక్కి తీసుకుందని, ఇది విద్యార్థుల పెద్ద విజయమని అన్నారు. ప్రధాని మోదీ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా, 'ప్రధానిగా మోదీ దేశానికి చేసిన మేలు' అనే అంశంపై ఓ కథనాన్ని ఐఐటీ మద్రాస్ లోని అంబేద్కర్ పెరియార్ సంఘం ప్రచురించింది. దేశాన్ని కాషాయమయం చేసేశారని, దేశంలో ఉండడం కంటే, విదేశాలకు తిరిగేందుకే ప్రధాని ప్రాధాన్యత ఇస్తున్నారంటూ, ప్రజా ధనంతో పారిశ్రామిక వేత్తలను తీసుకువెళ్తున్నారని, పారిశ్రామిక వేత్తలకు అధికారులు ఊడిగం చేసేలా ప్రధాని తీరు ఉందంటూ అంబేద్కర్ పెరియార్ సంఘం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విద్యార్థి సంఘాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై పోరాడిన విద్యార్థి సంఘం కేంద్రం దిగి వచ్చేలా చేసింది. విద్యార్థి సంఘంపై నిషేధం ఎత్తివేయడంపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు.