: ముందుంది మంచికాలం... డబ్బు సిద్ధంగా పెట్టుకోండి!


ఒడిదుడుకుల మధ్య సాగుతున్న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందాలని భావిస్తున్నారా? మార్కెట్లోకి ప్రవేశించేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా? అయితే, నిపుణులు మీకిస్తున్న సలహా ఏంటంటే, మరికొంత కాలం వేచి చూడండని. ఈక్విటీలు మరింతగా పతనం అయ్యే అవకాశాలున్నాయని, 2016లోనే బుల్ రన్ తిరిగి ప్రారంభమవుతుందని ప్రధాన బ్రోకరేజి సంస్థల్లోని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి సెన్సెక్స్ సూచిక తన జీవితకాల గరిష్ఠ స్థాయి 30,024 పాయింట్లతో పోలిస్తే చాలా దిగువన కదలాడుతోంది. ఈ ఆల్ టైం రికార్డు మార్చిలో నమోదుకాగా, ఆ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం దిగజారింది. నిఫ్టీ పరిస్థితి కూడా ఇంతే. 2015 ఆరంభం నుంచి బెంచ్ మార్క్ సూచికలు సంపాదించిన లాభాలనన్నింటినీ, గత రెండు నెలల్లో కోల్పోయాయి. తిరిగి మార్కెట్ రికార్డు స్థాయులకు వచ్చే సంవత్సరం రెండో అర్ధ భాగంలో మాత్రమే వెళుతుందని నిపుణుల అంచనా. వచ్చే ఒకటిన్నర సంవత్సరంలో సెన్సెక్స్ 35 వేలకు, నిఫ్టీ 11 వేల పాయింట్లకు చేరవచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. ఇక సిద్ధాంత పరంగా ఆలోచిస్తే, మార్కెట్ మరింత పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, నిఫ్టీ 8 వేల నుంచి 8,500 పాయింట్ల మధ్య చాలాకాలం పాటు కదలాడవచ్చని మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. సరైన సమయం వచ్చినప్పుడు పెట్టుబడి పెడితే త్వరితగతిన మంచి లాభాలను పొందవచ్చని, ప్రస్తుతానికి ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే, బాండ్ మార్కెట్లు స్థిరమైన లాభాలను అందించనున్నాయని అన్నారు. కాగా, సూచికలు 40 వారాల కదలికల సరాసరిని దాటి మరీ పడిపోయిన నేపథ్యంలో, వచ్చే ఆరు నుంచి 12 నెలల కాలంలో రెండంకెల వృద్ధిని అందించగల స్టాక్స్ వెతికిపట్టుకోవడం సులభమేనన్నది మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా. కాగా, వచ్చే రెండు మూడు నెలలు స్టాక్ మార్కెట్ కు కష్టకాలమేనని అంబిత్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్ర్యూ హోలాండ్ వివరించారు. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్ నడవనుందని, 2016లో నిఫ్టీ 11 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. డిసెంబర్ నాటికి 9,760 పాయింట్లకు, జూన్ 2016 నాటికి 10,600 పాయింట్లకు నిఫ్టీ చేరవచ్చని సిటీ గ్రూప్ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News