: ఢిల్లీ వెళ్లనున్న జగన్... ఓటుకు నోటుపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ప్రమేయముందన్న ఆరోపణలు, ఆ పార్టీ తెలంగాణ కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ తో వైసీపీ వేగంగా స్పందించింది. ఢిల్లీ వెళ్లి ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు జగన్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు టీడీపీకి వ్యతిరేకంగా పార్టీ నేతలతో ఏపీలో ఆందోళనలను సాగిస్తూనే కేంద్రానికి కూడా చంద్రబాబుపై ఫిర్యాదు చేయాలని జగన్ తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నారు. రేపు ఢిల్లీ వెళ్లగానే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న జగన్, మరునాడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ భేటీ కానున్నారు. ఈ మేరకు జగన్ కు రెండు చోట్లా అపాయింట్ మెంట్లు లభించినట్లు సమాచారం.