: పాలు, కూరగాయల్లో విషాలున్నాయా?: రంగంలోకి దిగిన ఆహార భద్రతాధికారులు


మ్యాగీలో హానికారక విష పదార్థాలు ఉన్నాయని వెల్లడైన తరువాత పలు ఇతర ఉత్పత్తులను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. వివిధ చోట్ల అమ్ముతున్న కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులను పరీక్షలకు పంపాలని, ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీటిల్లో ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు హాని కలిగించే రసాయనాలు ఏ మేరకు ఉన్నాయన్న విషయంపై పరీక్షలు నిర్వహించనున్నామని, త్వరలో ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని, ఇందుకోసం మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. హానికారక పదార్థాలు ఉన్నాయని తేలితే చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కాగా, 2011లో ఎఫ్ఎస్ఎస్ఏఐ పాల ఉత్పత్తులపై జరిపిన పరీక్షల్లో డిటర్జంట్లలో వాడే రసాయనాలు ఉన్నట్టు వెల్లడైంది. 2013లో యూనివర్శిటీ ఆఫ్ బరోడా జరిపిన అధ్యయనంలో భాగంగా పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పెరుగు తదితరాల్లో కాడ్మియం స్థాయి పరిమితికి మించి ఉన్నట్టు తేలింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న విషయం మాత్రం ఎక్కడా వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News