: చంద్రబాబు ఆడియో టేపులపై ఏకే ఖాన్ అత్యవసర భేటీ...నోటీసుల జారీకి సన్నాహాలు
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు సంబంధించినదని భావిస్తున్న ఆడియో టేపులపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తన శాఖాధికారులు, న్యాయ నిపుణులతో కొద్దిసేపటి క్రితం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆడియో టేపునకు సంబంధించి తదుపరి చర్యలపై ఏకే ఖాన్ సమాలోచనలు చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న మీదట నోటీసుల జారీకి శ్రీకారం చుట్టాలని కూడా ఖాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే, చంద్రబాబుతో పాటు స్టీఫెన్ సన్ కూ నోటీసులు జారీ అయ్యే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఈ భేటీపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.