: జెమినీ సహా ఆగిపోనున్న 33 సన్ టీవీ చానళ్లు... కుదేలైన ఈక్విటీ
ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ లో సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ ఈక్విటీ వాటా ఏకంగా 25 శాతం పడిపోయింది. క్రితం ముగింపు రూ. 356తో పోలిస్తే రూ. 91 తగ్గి రూ. 265కు చేరింది. సన్ గ్రూప్ లోని చానళ్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి నిరాకరించిందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ చానళ్లకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు హోం శాఖ అంగీకరించలేదని, దీంతో పలు భాషల్లో సన్ గ్రూప్ అందిస్తున్న 33 చానళ్లను మూసివేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. సన్ గ్రూపు నుంచి తెలుగులో జెమినీ, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమినీ యాక్షన్, జెమినీ లైఫ్ తదితర చానళ్లున్నాయి. వీటిల్లో మూడేళ్లకు పైగా నడుస్తున్న చానళ్లను మూసివేయాల్సి రావచ్చని తెలుస్తోంది. కాగా, హోం శాఖ నిర్ణయాన్ని సన్ గ్రూప్ కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.