: రేవంత్ రెడ్డికి జ్వరం, గొంతునొప్పి... ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన ఏసీబీ అధికారులు

ఓటుకు నోటు కేసులో అరెస్టై, ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం కోర్టు అనుమతితో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మొన్న, నిన్న కేసుకు సంబంధించి పలు కోణాల్లో విచారించారు. తొలి రోజు కేవలం రెండు గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు నిన్న మాత్రం దాదాపు ఆరు గంటల పాటు 60 ప్రశ్నలను సంధించారు. విచారణ తీరు ఎలా ఉన్నా, తమ కస్టడీలోని రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. తొలి రాత్రి రేవంత్ నేలపైనే పడుకున్నారు. అవసరం లేకున్నా కుర్చీలో ఆయనను ఏసీబీ అధికారులు గంటల తరబడి కూర్చోబెట్టారు. ఇక స్నానం చేయడానికి కూడా అనుమతించని ఏసీబీ అధికారులు తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నేడు మూడో రోజు విచారణ ప్రారంభానికి ముందు రేవంత్ రెడ్డికి జ్వరమొచ్చింది. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.