: టీఆర్ఎస్ కు టీడీపీ కౌంటర్....వైరా ఎమ్మెల్యేకు కేటీఆర్ ఎర: ఆడియో టేపులు రిలీజ్
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ‘ఆడియో టేపు’ల దాడికి విపక్ష టీడీపీ కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది. టీఆర్ఎస్ విడుదల చేసిన మాదిరిగానే మరో ఆడియో టేపును విడుదల చేసి కౌంటర్ ఇచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులను టీఆర్ఎస్ విడుదల చేసిన వెనువెంటనే, వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కు టీఆర్ఎస్ నేతలు ఎరవేసిన వైనంపై టీడీపీ కూడా ఆడియో టేపులను రిలీజ్ చేసింది. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ (వైసీపీ)కు రూ.3 కోట్లు ఇవ్వజూపినా పార్టీ మారేందుకు ఒప్పుకోలేదట. ఆయనతో మాట్లాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వైరా డీఎస్పీ రామిరెడ్డిని పురమాయించారు. ఈ విషయాన్ని రామిరెడ్డే పలుమార్లు చెప్పారు. అది కూడా ఎమ్మెల్యే మదన్ లాల్ తో కలిసి కూర్చుని మాట్లాడుకున్న సందర్భంగా ఈ విషయాన్ని రామిరెడ్డి వెల్లడించారు. వైసీపీ టికెట్ పై వైరా నుంచి పోటీ చేసి గెలిచిన మదన్ లాల్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు కేటీఆర్ యత్నించారు. ఇందుకోసం రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధమని ఆపర్ చేశారు. అయితే మదన్ లాల్ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే చాలని మదన్ లాల్ మంత్రి కేటీఆర్ కు సూచించారట. ఇదే విషయాన్ని వైరా డీఎస్పీ రామిరెడ్డికి చెప్పిన కేటీఆర్, మదన్ లాల్ తో మాట్లాడి పని చక్కబెట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనతో రామిరెడ్డి రంగంలోకి దిగి మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరేలా చూశారు. ప్రస్తుతం మదన్ లాల్ వైసీపీని వీడి టీఆర్ఎస్ లో ఉన్నారు. మదన్ లాల్, రామిరెడ్డి మంచి మిత్రులు. వీరిద్దరూ అజీజ్ అనే ఓ కాంట్రాక్టర్ తో కలిసి ఓ కోల్డ్ స్టోరేజీ వద్ద కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపులను టీడీపీ విడుదల చేసింది. చంద్రబాబుపై టీఆర్ఎస్, ఆ పార్టీపై టీడీపీ విడుదల చేసిన ఆడియో టేపులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.