: ఆన్ లైన్ లాటరీ ఉచ్చులో పడ్డ బాలీవుడ్ హీరో
మీకు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందంటూ తొలుత ఈమెయిల్ వస్తుంది. దానికి మనం స్పందిస్తే, మీ డబ్బును సొంతం చేసుకోవాలంటే... ప్రక్రియలో భాగంగా కొంత ఫీజు చెల్లించాలని మరో మెయిల్ వస్తుంది. ఇలాంటి ఆన్ లైన్ మాయలో పడి ఎంతో మంది లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. తాజాగా, ఆ జాబితాలో బాలీవుడ్ హీరో కరణ్ సింగ్ గ్రోవర్ కూడా చేరాడు. ఆన్ లైన్ లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారన్న మెయిల్ కు స్పందించిన కరణ్... వారు అడిగిన విధంగా రూ. 5.60 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కరణ్ కు డబ్బు అందక పోగా, నిర్వాహకులు కూడా పత్తా లేకుండా పోయారు. అప్పుడు అర్థమయింది మన హీరోకు తాను మోసపోయానని! దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు కరణ్. 'అలోన్' అనే బాలీవుడ్ చిత్రంలో బిపాసాబసు సరసన కరణ్ నటించాడు.